SEETHAMMA VAAKITLO SONGS REVIEW
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఒట్టేయకుండా చెబుతున్నా...ఇప్పుడందరూ మాట్లుడుకునేది ఈ చెట్టు గురించే...చాలా కాలం తరువాత ఒక మల్టీస్టారర్ సినిమా నిండు తెలుగుదనం తో సంక్రాంతికి సందడి చేయబోతుంది. ఇద్దరు హీరోలు వెంకటేష్ , మహేష్ బాబు విపరీతమయిన మహిలాభిమానులు కలవారే....సో ఈ టైటిల్ సరిగ్గా సరిపోయింది...అలాగే దిల్ తో పాటు టేస్ట్ ఉన్న నిర్మాత..."దిల్" రాజు, కొత్త బంగారులోకాన్ని కనుగొన్న శ్రీకాంత్ అడ్డాల సారధ్యంలో వస్తున్న సినిమా...
ఈ సీతమ్మ వాకిట్లోని స్వరాలూ గురించి..నాలుగు తీయని మాటలు...ఈ చిత్రానికి స్వరకల్పన చేసింది మిక్కి జే మేయర్. మిక్కికి ఈ చిత్రం...ఒక సవాలు...ఒక పెద్ద పరీక్ష కూడా ....
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..సిరిమల్లె చెట్టేమో ఇరగ పూసింది..కొమ్మా కదలకుండా..కొయ్యండి పూలు.కోసినావన్ని సీత కొప్పు చుట్టండి.కొప్పునా పూలు గుప్పెడంత ఎందుకండీ...కోదండరాముడు వస్తున్నాడండి "
ఎప్పుడో నాలుగు నెలల క్రితం బయటకి వచ్చిన ఈ పాటలోని ఈ చిన్న ముక్క ఇంకా అందరి నోళ్ళలో నానుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు...ఈ స్వరం ఎంత పెద్ద హిట్టో ! ఈ సినిమా టైటిల్ ని పది కాలాల పాటు గుర్తుకుతెచ్చే పాట.
ఇంత అందంగా పాడింది, సీనియర్ గాయని చిత్ర గారు. అనంత శ్రీరాం రచన చిన్న చిన్న పదాలతో కూడా చక్కగా ఉంది. వింటుంటే పెళ్లి పాటలా ఉంది...సినిమాలో సీతగా చేసింది అంజలి కాబట్టి..బహుసా పెద్దోడు(వెంకటేష్) పెళ్ళిలో పాటేమో!!
ఆరడుగులుంటాడా ...ఏడు అడుగులేస్తాడా ..ఏమడిగినా ఇచ్చేవాడా! ఆశ పెడుతుంటాడా ..ఆట పడుతుంటాడా ..అందరికి నచ్చేసే వాడా...!!
ఆరడుగులుండి అందరికి నచ్చేసే హీరో ఎవరయ్యి ఉంటారబ్బా?నాకు తెలిసి "ఒక్కడే". అదేనండి మన "ఒక్కడు" హీరో మహేష్. " నువ్వేమాయ చేసావో కానీ "...లేక "ఎన్నాళ్ళకి గుర్తోచ్చానే వాన" లా ఫిమేల్ సోలో పాటల్లో చాలా కాలం గుర్తుండిపోయే ఈ పాటను పాడింది కళ్యాణి. అమ్మో అనంత శ్రీరాం...చాలా పెద్ద లిస్టే తయారు చేసాడు అమ్మాయిల ఊహల రాకుమారుడి గురించి..."మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టాలి.. అడిగిన వెంటనే అలవోకగా మొయ్యాలి, అలవాటుగా అందాన్ని పొగడాలి, అలిగితే అందంగా బతిమాడాలి". సో ఈ పాటని ఫాలో అయితే అమ్మాయిలు పడిపోవటం సింపులు..!!
ఓహో ఓ అబ్బాయి..నీకై ఓ అమ్మాయి ఉంటుందోయ్ వెతుక్కోమని అన్నారే ..ఇందర్లో ఇలాగే..అయినా నేనీ జాడే వెతుక్కుంటూ ఒచ్చానే..
అనంత శ్రీరాం రాసిన ఈ పాట లో భలే గమ్మత్తైన విషయాలు ఉన్నాయ్..."వెతికే పనిలో అబ్బాయిలు ఉంటే ...పాపం ఎదురుచూపై అమ్మాయిలు ఉంటారంట.." "సరే అమ్మాయి పుట్టిందే అబ్బాయి కోసమైతే మరి కలవడం కోసం ఇరవయ్యేళ్ళు ఎందుకు? అంటే "ఒకరికొకరం నచ్చేలా మారడం కోసం" సూపర్ గా చెప్పారు..చివర్లో అబ్బాయిలని "మంచోళ్ళు మొండోల్లు " అంటూ మోసేసారు శ్రీరాం..మీరింకా ఎన్నెన్నో మంచి పాటలు రాసేయాలింకా... అలాగే రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ కూడా ఇంకా ఎన్నెన్నో పాటలు పాడేయలింకా!!
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా ...
ఈ సారి సీతారామ శాస్త్రి గారి వంతు. చిరునవ్వు గురించి రాయమంటే ఆయన ఊరుకుంటారా ...చించి అవతల రాసేసారు ..."ఎండలను దండిస్తామ..వానలను నిందిస్తామా ..మరి సాటి మనుషులతో మనకెందుకు పేచీ,సర్డుకుపోఎదానికి" "అలాగే చిరునవ్వుల కోసం చెమటలు చిందించాలా?,శ్రమ పడి ఎమన్నా పండించాలా?" "సుఖ శాంతుల కోసం కండలను కరిగించాలా , కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాదించాలా ?" "మనుషలనిపించే ఋజువు , మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేల్లయినా వాడని చిరునవ్వు" అంటూ చిరునవ్వుకున్న చీరాయువు గురించి చక్కగా చెప్పారు. ఇండియన్ ఐడల్ శ్రీరామా చంద్ర పాడాడు ఈ పాట .
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే !!
ఈ ట్యూన్ వినగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే పాట "ప్రేమంటే ఇదేరా" లో "నైజాం బాబులు...నాటు బాంబులు " పాట. కొత్త గా లేక పోయినా హుషారైన పాట. బహుసా వెంకటేష్ అంజలిల యుగళ గీతం అయ్యుండొచ్చు. కార్తీక్ అంజనసౌమ్య ఆలపించారు. కేరళ లో తీస్తునారనుకుంటా. సో జలపాతాలు..వాన చినుకులు పుష్కలంగా ఉంటాయి .
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది...
పాటలో చెప్పినట్టు ఓ అచ్చ తెలుగు పెళ్లి పాట . బహుసా సినిమాలో హీరోల చెల్లి పెళ్లి కి సంభందించిన పాట .పెళ్లి కంటే కూడా పెళ్లి పనులకు సంబందించిన చిన్న పాట. పెళ్లి చేసుకునే వారు బిడియం తో తల వంచుకుంటే ...పెళ్లి చేసే వారు పని ఒత్తిడి తో శిరసు వంచుతారంట .సీతారామశాస్త్రి గారి సాహిత్యాన్ని కార్తీక్, శ్రీరామాచంద్రలు...అన్నదమ్ములై ఈ పాట పాడారు.
ఎం చేద్దాం...
శాస్త్రి గారికి ఇంట్రడక్షన్ పాట ఇస్తే మాత్రం చమ్మక్కులు లేకుండా రాసేస్తారా..."ఆకాశం విరిగినట్టుగా...కూడనిదేదో జరిగినట్టుగా...కిం కర్తవ్యమ్ అని కలవార పాడడం కొందరి తరహ" కాని "అవకాశం చూసుకుంటూ..ఆటంకాలు ఒడుపు గా దాటుకుంటూ వాటంగా దూసుకు పోవడం మన హీరోల తరహ అని చెప్పే పాట. మళ్లీ కార్తీక్, శ్రీరామాచంద్రలు ఇద్దరు ఈ పాటకి హీరోలు.
మొత్తం గా చూస్తె అద్బుతమైన పాటలు. సంగీతం తో సాహిత్యం సహవాసం చేసిన సుమధుర గీతాల సమాహారం ఈ సిరిమల్లె చెట్టు. పాటలకి తగ్గట్టు కథలో కూడా తెలుగుతనం ..కొత్తదనం ఉంటె..ఈ సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో రికార్డుల ముగ్గు వేయడం కాయం. అప్పటిదాక మనం "ఎం చేద్దాం", ఎంచక్కా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ జరుపుకుందాం...!!
0 comments:
Post a Comment