కథ: అనగనగా ఓ ఊరిలో ఓ మంచాయన, ఆయనని అర్ధం చేసుకునే బార్య...వారికి ఓ చిన్నోడు పెద్దోడు,ఓ చెల్లి..ఓ ముసలి బామ్మ..చివరగా ఆ పెద్దాయన మేనకోడలు "సీత"(అంజలి). ప్రయోజకుడు కాని పెద్దోడి తో సీత పెళ్లి....అసలు వాళ్ళంటేనే అసహ్యించుకునే వ్యక్తి కూతురి(సమంత) తో చిన్నోడి పెళ్లి ఎలా జరిగాయి అనేది సినిమా కథ. కథ గా చూస్తే మూడు పెళ్ళిళ్ళు మాత్రమె అనుకుంటే పొరపాటే...ఎందుకంటే ఆ పెళ్లిల్లలోనే జీవితమంత కథ ఉంది.
పాత్రలు మాత్రమె కనిపించాయి...
పెద్దోడికి లౌక్యం తెలిదు...నవ్వుతూ పలకరించడం అసలు చేత కాదు...అందుకే జీవితం లో స్దిరత్వమే లేదు. తమ్ముడంటే పిచ్చి ప్రేమ. తనని పిచ్చి గా ఇష్టపడే సీత లాంటి మరదలిని ప్రేమించడం కూడా రాని పిచ్చోడు. వెంకటేష్ కాకుండా ఇంకెవ్వరు ఈ రోల్ కి సరిపోయేవారు కాదు. మహేష్ కంటే నాలుగు మాటలు తక్కువ ఉన్నా...కూడా పెద్ద తరహగా సినిమాని నడిపించాడు.
చిన్నోడు...స్క్రీన్ మీద చూస్తేనే అమ్మాయిలందరూ ఫిదా అయిపోయే పర్సనాలిటీ. ఇక రెండు నిమిషాలు మాటలాడితే ఎవర్తైనా ఎందుకు పడిపోదు. మాటలతో మస్కా కొట్టిన్చేస్తాడు. అప్పుడప్పుడు అప్పారావు..సుబ్బారావు పేర్లు చేప్పి ...తన మనసు లో ఉన్న ఫీలింగ్స్ ఈజీ గా చెప్పేస్తుంటాడు. ఎన్ని చెప్పినా అన్న ని, నాన్నని ఎవరన్నా ఎమన్నా అంటే ఊరుకోడు. మహేష్ గోదావరి యాస తో సింప్లీ సూపర్బ్ అనిపించాడు. ఆహాలకి పోకుండా తమ్ముడిలా అల్లుకుపోయాడు.
రైల్వే గేటు పడినపుడు తొందరపడి తలవంచే తత్వం కాదు పెద్దోడిది...అదే గేటు పడగానే దూకేసి పోయే తత్వం చిన్నోడిది...ఒక సీన్ లో వారిద్దరి కి ఉన్న వత్యాసం భలే చూపించాడు దర్శకుడు.
ఈ అన్నదమ్ములిద్దరు పోటి పడింది...ఒక్క డాన్సు లోనే ...!!!!!డాన్సు అంటే నడక అని ఫిక్స్ అయిపోయారు..!
నవ్వటం...నలుగురిని నవ్వుతూ పలకరించడం, అందరు మంచోల్లని అనుకోవడమే తెలిసిన వ్యక్తి గా ప్రకాష్ రాజ్ జీవించేసాడు. ఇద్దరి కొడుకులు ఆమెకి రెండు కళ్ళు..బ్రతకడం చేత కాని పెద్దోడంటే ఇంకొంచెం ఎక్కువే, జయసుధ ఇలాంటి పాత్ర చేసి ఎన్ని రోజులయ్యిందో. మనింట్లో కూడా ఉంటె బాగుండే అని అనిపించే బామ్మ రోహిణి హట్టంగడి .
ఇక సీత చాలా అమాయికురాలు, అత్తా మామలు ఆమెకి అమ్మ నాన్నలు. పాపం బావంటే పిచ్చి.అసలు ఈ అంజలికి ఇంత యాక్షన్ ఎవరు నేర్పించారు రా బాబు. మొదటి సారి ఇంత పెద్ద స్టార్స్ తో చేస్తున్నా కూడా, సీతగా అందర్నీ దాటుకుంటూ పోయింది. నేను అభిమానిని అయిపోయా...
సమంతాది ఎప్పటి లాంటి పాత్రే, అదే గొంతుతో. బట్ హిట్ పెయిర్...సో నో కంప్లైంట్స్. తన రోల్ వరకు చాలా బాగా చేసింది.
ఈ సినిమాకి విలన్ అంటే రావు రమేష్. ఈ కుటుంబాన్ని చులకన గా చూసే పాత్ర. తనికెళ్ళ భరణి, కోట, మురళీమోహన్,రమాప్రభ హుందాగా చేసారు. రవిబాబు..అండ్ మిగతా ఫ్రెండ్స్ గ్యాంగ్ పర్లేదు. కొత్తబంగారు లోకం లో ఉన్న వారు చాల మంది ఉన్నారు.
మాటలు...పాటలు
మాటలు పోదిగింది గణేష్ పాత్రో...ఈయన ఇంతకుముందు సీతారామయ్య గారి మనవరాలు..మరో చరిత్ర లాంటి ఆణిముత్యాలకి మాటలు రాసారు. చాలా మాటలు సహజం గా ఉంటాయి..మనం అక్కడ ఉంటె ఎం మాట్లాడతామో...సినిమాలో మాటలు అవే ఉన్నాయి.. ఇంకొన్ని జీవన సత్యాలు.." మనుషులందరూ మంచోల్లే....అసలు మంచోడంటేనే మనిషి"
మహేష్ కి రాసిన డైలాగులకి నవ్వని వారుండరు..."అసలు మనం అంటే వెంట పడ్డ అమ్మాయి ఓ గొట్టం గాడిని చేసుకుంటే ఆ ఫీలింగ్ సుపెరేహే.."
పాటలన్నీ సందర్భోచితం.(songs review) సినిమాలో అందంగా ఉన్న పాట "మేఘాల్లో". ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు...మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసాడు.
సినిమా ఎప్పుడు అయిపోయిందో...!!
కొత్త బంగారు లోకం లాంటి హృద్యమయిన సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల నిజ జీవితం తన అన్న తో ఉన్న అనుబంధమే ఈ సినెమా గా తీసాడు అంటున్నాడు. మూవీ మొదలయ్యాక ఒక పది నిమిషాల దాకా మహేష్ వెంకటేష్...ఒకరితో ఒకరు మాటలాడుతూ ఉంటె అంత సింక్ లేదేమో అనిపిస్తుంది...కాని అన్నదమ్ములంటే అంతే అని అర్ధం అవుతుంది కాసేపట్లో. ఒకరిని ఒకరు పోరా..అనుకోడం...మరునిమిషమే ఒకరికోసం ఒకరు పరిగెత్తుకుంటూ రావడం..ఫోన్లో మాత్రం రెండు నిమిషాలే మాట్లాడుకోడం.కాని ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోడం. రియల్ లైఫ్ అన్నదమ్ములకి ఈ విషయాలు చెప్పక్కర్లేదు అనుకుంటా .
బావా మరదళ్ల సరసాలు...బామ్మ తో పరాచికాలు...ఇల్లు ఒదిలెప్పుదు బెంగలతొ మొదటి సగం యిట్టె అయిపోద్ది. హీరోల చెల్లి పెళ్లి విషయం లో జరిగే తగాదా తో సరదాగా జరిగే ఫస్ట్ హాఫ్ కి ఇంటర్వెల్. ప్రేమలు ఎక్కువ అయినప్పుడు కోపాలు సహజం గా ఎక్కువ ఉంటాయి. అలాగే మంచోల్లంటే పడనోల్లు ఉంటారు. సో వాటితో వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలతో నడిచే డ్రామా తో చివరికి క్లైమాక్స్ భద్రాచలంలో సుఖాంతం అవుతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో జరిగే విషయాలు చూస్తున్నట్లు ఉండటం వాళ్ళ సినిమా ఎప్పుదయిందో తెలీనే లేదు.
మళ్లీ వస్తుందో రాదో...
ఈ జీవితానికి మాత్రమే నువ్వు వీడికి అన్న..నువ్వు వీడికి తమ్ముడు. మరుజన్మ ఏమవుతుందో ఎవరికీ తెలీదు. సో అలా ఒక్కసారే ఉన్న ఈ బంధాన్ని నిలుపుకోమని చెప్పే కథ ఇది. కుటుంబాలు కలిసుంటే ..సమాజం బాగుపడుతుంది అని చెప్పే కథ. ఇలాంటివి పాత సినిమాలు చాలా వచ్చాయి. కాని మహేష్..వెంకటేష్ చేస్తేనే ఇప్పుడు పిల్లలు చూసేది. అలా ముందుకొచ్చిన ఇద్దరికీ హాట్స్ ఆఫ్ . ఇద్దరు కమర్షియల్ హీరోలతో మసాలాలు వండకుండా...గుర్తుండిపోయే మూవీ తీసిన శ్రీకాంత్ అడ్డాల రియల్లీ వేరి గ్రేట్. నమ్మి డబ్బులు పెట్టిన దిల్ రాజు పేరు పదింతలయ్యింది .
రేటింగ్.
75/100
0 comments:
Post a Comment